Sunday, 11 March 2018

నూతన వాణిజ్య విధానం 2015-20

గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎగుమతులు డాలర్ రూపంలో రెట్టింపు కావడంతోపాటు ఎగుమతుల విస్తృతీకరణకు జరిగింది. వాణిజ్య సరళీకరణ విధానాల కొనసాగింపు, బహుళ ఒప్పందాలు వంటివి భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటును పెంపొందిస్తాయి. వాణిజ్య ఒప్పందాల విషయంలో తగిన శ్రద్ధ వహిస్తే దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రగతిలో వాణిజ్య విధానం కీలక పాత్ర పోషిస్తుంది. అభిలషణీయ వాణిజ్య విధానాన్ని రూపొందించుకొని వాణిజ్య పరమైన అడ్డంకులను అధిగమిస్తే ఆర్థిక వృద్ధి రేటు వేగవంతమవుతుంది.

భారత విదేశీ వాణిజ్య విధానం - వివిధ దశలు ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ (1952-53 నుంచి 1956-57), రెండో దశ (1956-57 నుంచి జూన్ 1966), మూడో దశ (రూపాయి మూల్యహీనీకరణ తర్వాత), నాలుగో దశ (1975-76 తర్వాత).

మొదటి దశ వాణిజ్య విధానంలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సరళీకరణ చర్యలను అమలు చేశారు. తద్వారా దిగుమతుల్లో పెరుగుదల సంభవించింది. అయితే ఎగుమతుల్లో పెరుగుదల దిగుమతుల్లో పెరుగుదలకు అనుపాతంగా లేనందువల్ల వాణిజ్య లోటు పెరిగింది.

రెండో దశలో (1956-66)పణాళిక అవసరానికి అనుగుణంగా వాణిజ్య విధానాన్ని పునర్వ్యవస్థీకరించారు. దిగుమతుల నియంత్రణ, దిగుమతి ప్రత్యామ్నాయ చర్యలను అమలుచేస్తూ.. ఎగుమతుల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా ఎగుమతుల విస్తృతీకరణకు ప్రాధాన్యమి చ్చారు. ఈ దశలో వాణిజ్య విధానాన్ని ముదలియార్ కమిటీ సమీక్షించింది.

ప్రభుత్వం 1966, జూన్‌లో దిగుమతుల నియంత్రణ, ఎగుమతుల ప్రోత్సాహానికి మూల్యహీనీకరణ చేపట్టడం వల్ల మూడో దశలో ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రారంభంలో మూల్యహీనీకరణ వల్ల ఆశించిన ఫలితాలు రాకపోయినా, నాలుగో ప్రణాళిక నుంచి ఇది విదేశీ వాణిజ్యంపై ధనాత్మక ప్రభావాన్ని చూపింది. ఈ స్థితి 1975-76 వరకు కొనసాగింది.

నాలుగో దశలో ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం దిగుమతుల సరళీకరణ విధానాన్ని అవలంబించింది. జనతా ప్రభుత్వ కాలంలో ద్రవ్యోల్బణ విరుద్ధ దిగుమతుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం దిగుమతుల సరళీకరణ విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వ దిగుమతి ఎగుమతి విధానం లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి.

No comments:

Post a Comment